ఆదికేశవులు ఇంట్లో చోరి - మరి మేమో ?

రత్నాలు పొదిగిన నేక్లేసులు, వజ్రాల గడియారాలు ,
ఎన్నో వెండి సామాన్లు చోరి అయితే ఆదికేశవుల కుటుంబానికి తెలియనే లేదు .
.రివాల్వర్ పోయే వరకు పోలీసులవరకు పోనేలేదట !!!!
మరి మాయింట్లో ఎర్రగావుందే గ్యాసు సిలిండరు,
తెల్లగా వెలిగే  బల్బు ,
కొళాయిలలో నీరు,
కనిపించక చాలా కాలం అయ్యింది ..
కంప్లైంటు తీసుకుంటారా పోలీసులూ..
చాల ఆలీసం చెయ్యద్దు అస్సలు మేమే కనిపించక పోవచ్చు త్వరలో ..
సామాన్యులం గుర్తు పెట్టుకుంటారు కదూ !!!

ఒక జ్ఞాపకం

        ఒక  జ్ఞాపకం
--------------------------------
యాభై ఏళ్ళ పైమాటే......
అప్పుడు గ్యాసు పొయ్యిలు లేవు.
ఇత్తడి స్టవ్ లో కిరోసిన్ పోసి గ్యాసు కొట్టి వెలిగించేవి వున్నా  అవి పేలి పోతాయనే వదంతులు  ఉండడంతో వాటి వాడకము తక్కువే ..కాబట్టి వంటచేయ్యాలంటే కట్టెల పొయ్యిలు తప్పనిసరి.వాటి తో పాటు ఎక్కువగా వాడబడేది ఇనుప కుంపటి !
కట్టేలపోయ్యి లో పడ్డ నిప్పులను తీసి ఆర్పేసి బొగ్గులు చేసుకునేవారు . ఆ బొగ్గులు కుంపటి లో వేసి అడుగున కొంచెము టెంకాయ నార పెట్టి అంటించి కుంపటి కింద వున్న బొక్క [ opening ] దగ్గర విసన కర్రతో విసిరితే నెమ్మదిగా నిప్పులు తయారయ్యేవి. ఈ కుంపటి ని రాయలసీమలో బాగా వుపయోగిస్త్తారు ,
   మా పుట్టిల్లు .’ గట్టు ‘ గ్రామం , మదనపల్లి తాలూకా , చిత్తూరు జిల్లా .మా చిన్నప్పుడు పొద్దున్న లేవగానే మా అమ్మ స్వర్నమ్మ  కుంపటి వెలిగించేది. ఇత్త డి  కేటిల్ లో నీళ్ళు పెట్టి కాఫి డికాషన్ వేసేది. పాలు కూడా కుంపటి లోనేకాచేది  పాలు అడుగు అంటేవి కావు  చిక్కటి మీగడ కూడా కట్టేది . ఆ తరువాత  కుంపటి లోనే కంది పప్పు వుడికేది. అలా  నిదానం గా వుడికిన కంది పప్పు కట్టు తో పెట్టే చారు [ రసం] టమాటోలు వేయకపోయినా ఎంతో రుచి గా వుండేది .
జున్ను పాలు విరగ గొట్టి  , పాల విరుగుడు  బెల్లం కలిపి కుంపటి  మీద  బాణట్లో వేస్తె పిల్లలం కూర్చుని కలియబెట్టే వాళ్ళం..హల్వా లాటివి కూడా అడుగు అంటకుండా నిదానంగా కుంపటి లోనే సాద్యం అయ్యేది . ఎక్కువ సెగ కావాలంటే ఎక్కువ బొగ్గులు వేసి నిప్పులు చేసేవాళ్ళం . వద్దని అనుకుంటే నిప్పులు తగ్గించేసి సన్నని సెగ వాడేది అమ్మ .అలా నిప్పుల్లో నూనే రాసిన వంకాయలు కాల్చి  చేసె పచ్చడి ఇప్పటికి మరచిపోలేదు . పనస గింజలు కూడా దీని లోనే కాల్చుకుని తినేవాళ్ళం .
మదనపల్లె దగ్గర కాబట్టి  చలి కాలం బాగా  చలి వేసేది .పొద్దున్న లేవగానే  కుంపటి చుట్టూ కూర్చుని చేతులు వెచ్చ చేసుకునే వాళ్ళం . ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే కొంచం నిప్పులు వున్న కుంపటిలో చక్కెర , పసుపు చల్లి ఆ పొగ పట్టించేవాళ్ళు ముక్కు దిబ్బడ  నిముషం లో మాయ మయ్యేది .
 మేము పెద్ద వాళ్ళమై పెళ్ళిళ్ళు అయి సిటీ లకు పోయినా  కానుపులకు పద్దతిగా పుట్టింటికి వచ్చేవాళ్ళం . చిన్న పిల్లకు , బాలింతకు సాంబ్రాణి పొగ కొసం చిన్న ఇనప కుంపటి వుపయోగించేది అమ్మ ,అంతేకాదు బాలింతకు చలవలు చేస్తాయని  కుంపటి నిప్పుల్ల శాకం తో అరి కాళ్ళు చేతులు కాచు కోవాలన్నది రూలు .
మా పిల్ల లందరూ అత్తారిళ్ళకు వెళ్ళాక ఉద్యోగాల పర్వం ముగిసి , విశ్రాంత జీవనానికి మా అత్తవారి వూరు “కురబలకోట” [ మా పుట్టింటికి దగ్గరే ] వస్తే , ఎనభైఎనిమిదేళ్ళ మా అమ్మ స్వర్నమ్మ ఇచ్చిన అపురూప కానుక ఈ ‘ కుంపటి” దీన్ని చూసిన ప్పుడల్లా మా చిన్న తనం గుర్తుకు వచ్చి దాని గురించిన జ్ఞాపకాలను మా మనవళ్ళకు, మనవరాళ్ళ  కు  చెబుతూ వుంటా గర్వంగా...

ప్రభుత్వం ---ఉచిత సలహాలు


         ప్రభుత్వం ---ఉచిత సలహాలు
1 ]  కరెంటు కోత గురించి  ఆలోచించవద్దు .
    మరీ ఉక్కపోస్తే కిటికీలు తెరిచి పెట్టుకోండి .
    చల్లని గాలిని చక్కగా అనుభవించండి .
    ఆరుబయట దోమతెరలు కట్టుకుని హాయిగా నిదురపో ౦డి 

2]  కరెంటు ఆదా చెయ్యండి .
   ఆదా ఎలా చెయ్యాలో నేర్చుకోండి
  ౧]  హై మాస్టు దీపాలు మాని ట్యూబు లైట్లు వెలిగించుకోండి
      అదీ వీలు లేకుంటే  కిరోసిన్ తో బుడ్డి దీపాలు పెట్టు కొండి
  ౨]  గీజర్లు వాడడం మానండి .
       చన్నీటి స్నానం  కు అలవాటు పడండి
      ఆరోగ్యానికి ఆరోగ్యం ....ఆదా కి ఆదా
 ౩] వాషింగు మిషన్లు  వాడటం మానండి .
  ఒక అరగంట చేతికి పని చెప్పితే బాగా మురికి పోయి
   మీ బట్టలు మెరుస్తాయి !!! 
    అంతే కాదు శరీరానికి మంచి excersise  కూడా .
   ఆరోగ్యం ఇంకా మెరుగు పడుతుంది
౪] రెఫ్రిజిరేటర్ వాడ వద్దు .
   దీని మరో పేరు సద్దిపెట్టె..దీని ఆఫ్ చేస్తే కరెంటు ఆదా నే కాదు ,
   సద్ది కూడు తినే బాధ తగ్గుతుంది !!
   ఏ పూట కా పూట తాజాగా చేసుకు తింటే ఆరోగ్యం మరింత మెరుగు !!
౫] టి. వీ లు  చూడటం మానండి .
    ఇంటి అరుగు మీద కూర్చుంటే బోల్డు కబుర్లు !
   ఏళ్ళ తరబడి ససేషం  గా నడిచే టి వీ సీరియళ్ళ కన్న
   ఎప్పటికప్పుడు తాజా గా సమాచారం , రోజు కో కొత్త కథనం ..లభ్యం !!
౬]  మైక్రో అవన్లు మానెయ్యండి .
    చిన్న బొగ్గుల కుంపటి కొనుక్కోండి
    వేడి చేసు కోవడం సులభమే కాదు , చాలా డబ్బు ఆదా కూడా
          చక్కటి ప్రకృతి లో స్వేచ్చ గా గాలిని ఆస్వాదిస్తూ , చన్నీటి స్నానంతో  ఆరోగ్యాలు చక్కబడి ఎంతో శక్తి వస్తుంది . అప్పుడు  ఆలోచనలు మారతాయి .
వర్షాలు లేకనే కదా ఇన్ని కష్టాలు !! వరుణ దేవుడిని కరుణించమని వేడుకుందాం ,ఆయనకీ “ క్విడ్ ప్రో కో “గురించి చెబుదాం ఆయనమనకు వర్షం ఇస్తే ఆయనకు మనం ఏమీ ఇస్తామో డిస్కస్ చేద్దాం..అయినా న్యాయ నిర్నేతలే
“బెయిలు” కొసం కోట్లు తినడం సాద్యం అయినప్పుడు ..దేవుడిని లొంగ తీసుకోలేమా ?  ఆలోచిద్దాం ..
          ప్రభుత్వం మంత్రుల పై చార్జిషీట్ల తో , వాళ్ళ రాజీనామాలతోను , బొగ్గుల రాజకీయాలతో బిజీగా వుందికదా ..
మనతిప్పలు మనమే పడదామా?

ఎంతకాలం ఈ నిరీక్షణం ?


                    ఎంతకాలం  ఈ  నిరీక్షణం ?
మంచి నీటికి రేషన్ .
విద్యుత్ కోత చెప్పలేనంత .
కూరగాయల ధరలు ఆకాశంలో
బియ్యం , పప్పుల ధరల మంటల్లో
కాలిపోతున్న సామాన్యుడా
ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం ఏమిచ్చింది నీకు ?

పెరుగుతున్న పెట్రోలు ధరలు!
ధిక్కారం చూపుతున్న ప్రకృతి వైపరీత్యాలు ,
బెంబే లేత్తించే బాంబుల దాడులు ,
ప్రేమోన్మాదుల ఆసిడ్ అటాకులు,
తవ్వినకొద్దీ బయటపడుతున్న
అక్రమార్కుల అవినీతి గనులు !
నడుము విరుస్తున్న రాజకీయ రాజీనామాలు ,
మళ్ళి , మళ్ళి వస్తున్న ఎలక్షన్లు ,
ఎక్కడికీ పయనం ? ఎటుపోతున్నాం మనం?
పించన్లు , ఫీజులు రెండు రూపాయల బియ్యా లు
ఎన్ని పథకాలు వచ్చినా
కనపడదేమి ప్రోగ్రేస్సు ???

ఓటుకు నోటు కాకుండా
మానవత్వాన్ని గెలిపించి నప్పుడే
మరో గాంధీ పుట్టగలడు
అవినీతి ఆంధీ ఆగగలదు
ఎప్పుడూ వచ్చు ఆ దిన౦ ?
ఎంత కాలం ఈ నిరీక్షణం ?నా కంప్యూటర్ ప్రయాణం


      నా కంప్యూటర్ ప్రయాణం
తెలియదు నాకు కంప్యూటర్ ప్రపంచం చాలా కాలం !
అమ్మాయికి అవసరమని అమెరికా వెడితే
ఇంట్లో కంప్యూటరు 24 గంటలూ ఇంటర్నెట్టూ!!
ఇంకేం అనుకునీ email  నేర్చుకున్నా
కానీ మెయిలు చూసుకునేలా స్నేహితులు ఎదగలా...
అప్పుడు అమ్మాయి google serch  నేర్పింది!
సెర్చి చేసి వివిధ విషయాలు తెలుసుకో బోయా..
అప్పుడు  అల్లుడు చెప్పాడు బ్లాగుల ప్రపంచం గురించి ,
నాపేరిట ఒక బ్లాగు చేసి రాసుకోండి మీరు రచయితలుకదా అన్నాడు
నా బ్లాగు నాయిష్టం ఏదైనా రాసుకోవచ్చు కదా అని
నా మనో భావాలను రాసుకున్న ...కానీ  చదివేది ఎవ్వరు?
కొన్ని నెలల తరువాత నా బ్ల్లాగు ఎవరూ చూసిన పాపాన పోలే ..
ఏమిచెయ్యాలో తెలియలా .....
“నిరాశే మిగిలింది “ అని రాసుకున్నా  ఆపై
తెలుగు బ్లాగులేవైన వున్నాయా అని సెర్చ్ చేశా
అప్పుడు తెలిసింది తెలుగు బ్లాగుల “సంకలినుల” లోకం
అలా  చూస్తుంటే కనిపించింది ఓక బ్లాగులో  ‘కథలకు విశ్లేషణ చెయ్యండి ‘
విశ్లేషణ చేసిపంపితే లింకు పంపండి అన్నారు
నాకు లింకు లివ్వడం రాదు అని రాసా ,
అప్పుడు తారసపడ్డారు “ బ్లాగూ గురువు “ జ్యోతీ
ఆమె పాఠాలు శ్రద్ధగా చదివా ..కొన్ని నేర్చుకున్నా
నా  బ్లాగుని అందంగా తీర్చిదిద్దింది జ్యోతి..
ప్రమదావనం లో చేరాక బ్లాగుల ప్రపంచం మరింత తెలిసింది !
ఇతరుల బ్లాగులను చూస్తే నేనూ  అలా  పరుగులు తీయగాలనా అని దిగులేసింది .
ఒక బ్లాగు ప్రవేశించగానే “హలో.. వెల్కం ‘ అంటారు
ఇంకొకరు చక్కటి పాటతో పలకరిస్త్తారు !
మరొకరు “ టైము ఇదీ “ అని గడియారం చుపిస్త్తారు !
“మీరు వచ్చారా  అంటూ ..”విజిటర్ ఎక్కడనుండో” అని లిస్టు చూపుతారు!
కూడలి..హారం జల్లెడ అంటూ వారెక్కడ గుర్తింపబడ తారో తెలుపుతారు !
దాని కింద  followers  అని ఫోటోలు చూపుతారు !!!
వామ్మో .....నాకేమి తెలియదే అనుకుని భయపడ్డా
బ్లాగు గురువుని ఆశ్రయించి ‘వీక్షకులను “ చేర్చుకున్న
నాలుగేళ్ల నా బ్లాగు ప్రయాణం తరువాత ..
నెల క్రితం followers చేర్చుకున్నా ..అయినా నా పిచ్చి గాని
నా బ్లాగునేవారు ఫాలో అవుతారు అని సందేహపడ్డ
ఆశ్చర్యంగా ఇద్దరు followers చేరారు నిన్నటికి !!
అందరిలా పరుగులు తీయక పోయినా ,
అన్నీ బ్లాగులలో వున్న విశేషాలు చేర్చుకోలేకపోయినా ,
విశ్రాంత జీవనం గడుపుతూ కరెంటు కోత వున్న పల్లెటూరిలో వున్నా
అమ్మాయి ఇచ్చిన లాప్ టాప్ తో వారానికి రెండు రోజులే internet చూసుకుంటున్నా
ఎంజాయ్ చేస్తున్నా అందరి బ్లాగులను చూస్తూ ,
రాస్తున్నా అంతర్జాల పత్రికలలో ,
64 ఏళ్ళ వయసులో నేర్చు కుంటూనే వున్నా
 నాకు తెలియని  కంప్యూటర్ ప్రపంచాన్ని..... ఎదగాలనే ఆశ తో
మీరిప్పుడు ఇదీ చదివారంటే ఎగిరి గంతేసి
ఒలంపిక్ మెడలు గెలుచుకున్నా  నన్న మాటే మరీ!!
ఉషోదయంandhra bhoomi- nata పోటిలో ఎంపికైన నా కథ 2-8-2012  ఆంధ్రభూమి సచిత్ర వా ర పత్రికలో వచ్చింది. 

విహంగ జాలపత్రికలో నా వ్యాసం

http://vihanga.com/?p=4772

రిటైరు అయ్యాక ఇలాటివి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి ....విహంగ వారు ఆదరించారు  ఇలా 

అమ్మాయి అమెరికా వెళ్ళిపోతే

అమ్మాయి అమెరికా వెళ్ళిపోతే
శూన్యం అయిపోయింది ఇల్లంతా
నిశ్శబ్దం అంతటా......
భరించడం  నేర్చుకోవాలి ఇంకా ...

జీవితం లో పరుగు


    జీవితం లో పరుగు
జీవితమే ఒక పరుగు !!!!!!!!!!!
చిన్నప్పుడు ఏడిస్తే అమ్మ పరుగు ,
ఆ పై రొజూ స్కూలుకు పరుగు ,
స్కూలు నుండి ఇంటికి వస్తే ట్యూషన్ కు పరుగు,
అందంగా కనిపించాలని హెయిర్ కట్టింగ్ కు  పరుగు ,
ఇంకా బాగా కనపడాలని బ్యూటీ పార్లర్ కి పరుగు
ఇంత అంద మా  అని అబ్బాయిలు అమ్మాయిల వెంట పరుగు ,
ఇంటర్ లో చేరితే చదువుల వెంట పరుగు ,
ఇంజనీరో , డాక్టరో కావాలని కోచింగుల వెంట పరుగు ,
ఆపై కౌన్సలింగులో కాలేజీల వెంట పరుగు ,
బాగా చదవాలని తలిదండ్రుల మాటల పరుగు ,
వయసు వికసించి ఆకర్షణలు ఎక్కువై ప్రేమవెంట పరుగు
ఎలాగో చదువులు ముగిసి ఉద్యోగం కొసం పరుగు ,
ఉద్యోగం లో ఎదగాలని నేర్పరితనానికై పరుగు ,
నాలుగు జీతాలు తీసుకోగానే పెళ్లి చూపులకై పరుగు
పిల్ల నచ్చితే పెళ్లి కోసమై పరుగు ,
సహజీవనంలో హృదయనందపు పరుగు ,
మరో రెండేళ్ళ లో చిన్నారి జననం కొసం పరుగు ,
బోసినవ్వుల ఆస్వాదనలో ఆనందపు పరుగు ,
తరువాత స్కూలు అడ్మిషన్ కొసం పరుగు ,
ఆపై స్కూలు ఫీజుల డబ్బులకోసం పరుగు ,
స్కూలు పూర్తి చెయ్యబోయే కూతురి   భవిష్యత్తు కై ఆలోచనల పరుగు
పై చదువులు అయ్యాక , ఉద్యోగా అన్వేషణ లో పరుగు ,
ఆ పై అల్లుడి వేటలో పరుగు
పెళ్లి అయ్యాక  వాళ్లి ద్దరు  అమెరికా ఉద్యగాలకై పరుగు ,
మనమల ముచ్చట్లు చూడలేకపోయమే అన్నీ బాధ పరుగు .
పదవీవిరమణ తో విశ్రాంత జీవనం కొసం పరుగు ..
పిల్లల కోసం అమెరికా వెళ్ళాలా అన్న ఆవేదన పరుగు ,
అందరు కలసి వుండలేకపోయామే అన్న యోచనతో పరుగు
దేశాన్ని వదలి పోవడం ఇష్టం లేక ,ఆద్యాత్మికతలో స్వాంతన  పొందాలని పరుగు,
ప్రశాంతత విలువ తెలిసేసరికి చావు కై పరుగు ,
మృత్యువుతో ఆగిన పరుగు !!!!!!!!!!!!!!!!!

జీవితం లో పరుగు


                      జీవితం లో పరుగు
జీవితమే ఒక పరుగు !!!!!!!!!!!
చిన్నప్పుడు ఏడిస్తే అమ్మ పరుగు ,
ఆ పై రొజూ స్కూలుకు పరుగు ,
స్కూలు నుండి ఇంటికి వస్తే ట్యూషన్ కు పరుగు,
అందంగా కనిపించాలని హెయిర్ కట్టింగ్ కు  పరుగు ,
ఇంకా బాగా కనపడాలని బ్యూటీ పార్లర్ కి పరుగు
ఇంత అంద మా  అని అబ్బాయిలు అమ్మాయిల వెంట పరుగు ,
ఇంటర్ లో చేరితే చదువుల వెంట పరుగు ,
ఇంజనీరో , డాక్టరో కావాలని కోచింగుల వెంట పరుగు ,
ఆపై కౌన్సలింగులో కాలేజీల వెంట పరుగు ,
బాగా చదవాలని తలిదండ్రుల మాటల పరుగు ,
వయసు వికసించి ఆకర్షణలు ఎక్కువై ప్రేమవెంట పరుగు
ఎలాగో చదువులు ముగిసి ఉద్యోగం కొసం పరుగు ,
ఉద్యోగం లో ఎదగాలని నేర్పరితనానికై పరుగు ,
నాలుగు జీతాలు తీసుకోగానే పెళ్లి చూపులకై పరుగు
పిల్ల నచ్చితే పెళ్లి కోసమై పరుగు ,
సహజీవనంలో హృదయనందపు పరుగు ,
మరో రెండేళ్ళ లో చిన్నారి జననం కొసం పరుగు ,
బోసినవ్వుల ఆస్వాదనలో ఆనందపు పరుగు ,
తరువాత స్కూలు అడ్మిషన్ కొసం పరుగు ,
ఆపై స్కూలు ఫీజుల డబ్బులకోసం పరుగు ,
స్కూలు పూర్తి చెయ్యబోయే కూతురి   భవిష్యత్తు కై ఆలోచనల పరుగు
పై చదువులు అయ్యాక , ఉద్యోగా అన్వేషణ లో పరుగు ,
ఆ పై అల్లుడి వేటలో పరుగు
పెళ్లి అయ్యాక  వాళ్లి ద్దరు  అమెరికా ఉద్యగాలకై పరుగు ,
మనమల ముచ్చట్లు చూడలేకపోయమే అన్నీ బాధ పరుగు .
పదవీవిరమణ తో విశ్రాంత జీవనం కొసం పరుగు ..
పిల్లల కోసం అమెరికా వెళ్ళాలా అన్న ఆవేదన పరుగు ,
అందరు కలసి వుండలేకపోయామే అన్న యోచనతో పరుగు
దేశాన్ని వదలి పోవడం ఇష్టం లేక ,ఆద్యాత్మికతలో స్వాంతన  పొందాలని పరుగు,
ప్రశాంతత విలువ తెలిసేసరికి చావు కై పరుగు ,
మృత్యువుతో ఆగిన పరుగు !!!!!!!!!!!!!!!!!

"మనసున మనసై " అని చెప్పుకున్నాఒక్కోసారి కథలే కాకుండా  జీవితం పంచుకున్న మనిషి గురించి చెప్పుకోవాలని అనిపిస్తుంది . అలాటి అవకాసం " "సాక్షి " పేపర్ వాళ్ళు ఇస్తే  ఇలా వుపయోగించుకున్నా  ' మనసున మనసై ' అని పాడుకుంటూ నలభై ఏళ్ళ సహచర్యం లో మొదటి సారిగా....1-6-2012  తేదీ న....

అమెరికా అడ్జస్ట్ మెంట్ [America adjustment]

అమెరికా అడ్జస్ట్ మెంట్

[America adjustment]

‘ Don’t touch my things , I don’t like it ‘

రవి గొంతులోని కర్కసత్వాన్ని గుర్తించడం తో కొంచం గాబరా అయ్యింది కాంతమ్మకు .

‘what is it Ravi?’ కాంతమ్మ కోడలు పద్మ అడిగింది కొడుకు రవిని .

“I don’t like nannamma in my room’ కోపంగా అన్నాడు రవి .

“ you shoud not say that ravi .నాన్నమ్మ ఇండియా నుండి మనకోసం ఇంతదూరం వచ్చింది కదా , మరో రూము ఇవ్వ్వడానికి లేదు కదా.so you have to share Ravi” నచ్చచెప్పడానికి చూసింది పద్మ .

I don’t like to share “ అతని అయిష్టం స్పష్టంగా కనపడింది .

“పోనీ లేమ్మా ....కొత్తకదా ....కొద్దిరోజులైతే సర్డుకుంటాడు “ అంది కాంతమ్మ అనునయంగా .

ఈ చిన్ని సంఘటనతో కొడుకు దగ్గరికి వచ్చిన సంబరం కాస్త చప్పబడినట్టయ్యింది కాంతమ్మకు .

********** *************** ***************

రవి పుట్టిన అయిదేళ్లకు పద్మకు మళ్ళి ప్రేగ్నన్సి వచ్చింది . నెలలు నిండాక వాళ్ళ అమ్మను పిలుచుకుందాం అనుకుంది. అనుకోకుండా పద్మనాన్నకు హార్ట్ అటాక్ వచ్చి జబ్బు పడటంతో ఈసారి అత్తగారిని రప్పించుకుంది .శ్రీకాంత్ పద్మల పెళ్లి తరువాత ఇండియాకి రెండుసార్లే వచ్చారు. .చివరిసారి రవికి రెండేళ్లు వున్నప్పుడు .ఆ తరువాత పద్మ కూడా జాబ్ చెయ్యడం మొదలు పెట్టినప్పటినుండి ఇండియా రావటం కుదరలేదు.అందుకే రవికి వాళ్ళ నాన్నమ్మ అంతగా గుర్తు లేదు .తన రూము లోకి పరాయి మనిషి ఎంటర్ అయిన ఫీలింగు వచ్చింది.పైగా అతనికి నాన్నమ్మ కట్టు బొట్టూ తీరు అస్సలు నచ్చలేదు . ఏదో వింతగా అనిపించింది .నాన్నమ్మ తల ముడి మరీ నాసిరకంగా అనిపించింది .

******** *************** ****************

” ఇంకా ఎన్ని రోజులు పని చెయ్యాలి పద్మా ..కానుపు టైము దగ్గర పడుతోంది కదా ..సెలవు పెట్టవచ్చేమో “

“ఇండియా లో లాగా ఎన్ని రోజులంటే అన్నీ రోజులు సెలవు దొరకదు అత్తయ్య. డెలివరి అయ్యాక సెలవు ఎక్కువ అవసరం కదా. అందుకే చివరి దాకా పని చెయ్యడమే మంచిది .”అండి పద్మ.

శ్రీకాంత్ పద్మ ఆఫీసుకు వెడుతూ రవిని ప్రీ స్కూల్ లో వదలి వెడతారు , తిరిగి రావటం సాయంకాలమే ..

ఎంతో అందం గా వున్నా ఇల్లు ,పాత్రలు కడగడానికి మిషన్ , బట్టలు వుతకదానికి మిషన్ ,ఆఖరికి ఇల్లంతా కార్పెట్ట్టు అవడంతో వూ డ వకుండా దుమ్మును suck చేసె vaccum cleaner..ప్రతిదీ వింతగానే వుంది కాంతమ్మకు. వచ్చిన రెండు రోజుల్లోనే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బక్కెట్టు మగ్గు లేని బాత్ రూం చాలా ఇబ్బంది పెట్టింది .పద్మ భర్తను శ్రీ....శ్రీ ...శ్రీ అని పిలవడం వినడానికి కష్టం గ అనిపించింది ..ఇక కారులో రవికి ,తన సీటు పక్కన నాన్నమ్మ కూర్చుంటే కూడా నచ్చడం లేదు . చిన్నపిల్లాడు కదా మాలిమి చేసుకోగలను అనుకున్న కాంతమ్మకు ప్రస్నార్తకమే మిగిలింది.

************* *************** ******************* **********

“ చామ దుంప వేపుడు చెయ్యనా ఈరోజు? శ్రీకాంత్ కు చాలా ఇష్టం ..” మాట పూర్తి కాకుండానే పద్మ అందుకుంది .

“ వద్దు అత్తయ్యా ...deep fry వి ఏమీ శ్రీ కి ఇవ్వడంలేదు .తనకి cholestral కొంచం ఎక్కువగా వుండి అందుక నీ అందరం నూనె వాడకం తగ్గించాము ...”

“ పోనీ చెయ్యమ్మా ..నీవు వేపుడు చేస్తే ఎంత ఇష్టం గా తినేవాడిని ‘ అని కొడుకు అంటాడని ఆశగా చూసింది శ్రీకాంత్ వైపు . కానీ అతను ఏమీ మాట్లాడక పోవటం ఇబ్బందిగా అనిపించింది .

దేవుడి కి దీపాలు వెలిగించి అగరొత్తులు తిప్పి కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ తులసి చెట్టు కొసం వెదుకుతున్న కాంతమ్మ కి

“అత్తయ్యా !! ‘అని గట్టిగా పిలుస్తున్న పద్మ గొంతు విని .

“ ఏమిటి? “ అండి

“ ప్లీజ్ అత్తయ్యా మీరు దీపాలు వెలిగిస్తే పర్లేదు కానీ వెంటనే ఆర్చేయ్యండి. ఇల్లంతా చెక్కలతో చేసినవి కదా ఏదైనా అంటుకుందంటే smoke detector పేద్దగా కేకేస్తుంది .. ఆపై పోలీసులు వస్తారు ..”

నిజమే ఇల్లు చెక్కలతో చెయ్యబడింది కదా తనూ ఆలోచించాల్సింది .కానీ దేవుడికి దీపం పూజ ఇన్నేళ్ళ అనుభవం కదా ..పెట్టిన దీపాన్ని వెంటనే ఆర్పెయ్యడం ఎంత అపరాధమో ....

“ తులసి మొక్క లేదనీ తెలీలేదు .వచ్చేటప్పుడు కాస్త విత్తనాలు తెచ్చేదాన్ని ..”

“మీరు విత్తనాలు వేసిన ఈ చలికి అవి మొలకేత్తేవి కాదులే అత్తయ్య .అందుకే పూజా, తులసి అన్నీ వదలుకుని అడ్జస్టు అయ్యాం...”

అడ్జస్టు....అన్న పదమోక్కసారిగా రవి నీ గుర్తుచేసింది ..ఇండియా లో అయితే మనవలతో ఎంతో దగ్గరగా చేర్చే నా న్నమ్మలు అమెరికా వచ్చాక మనవలతో అడ్జస్టు కావలసినదేనా? అనుబంధం ఎప్పుడు పెరుగుతుంది ?..

‘నాన్నమ్మ bed time stories చెబుతుంది ‘అని పద్మ ఎంత బతిమలాడినా నాన్నమ్మ పక్కన పడుకోనని మొండికేసి తల్లిదండ్రుల దగ్గరే ‘అడ్జస్టు” అవడానికి రవి సిద్దపడే సరికి ఏడుపొచ్చినంత పనయ్యింది కాంతమ్మకు ..పప్పు అన్నం పెడుతూ ,చందమామ నూ చూపుతూ చిన్ని చిన్ని కథలను వినిపించి మనవడితో మురిసిపోవాలనుకున్న కాంతమ్మకు నిరాశే ఎదురైంది ..

రెడిగా దొరికే MAC & CHEESE, NUGGETTS, JELLIS, PITZAA లతో కడుపు నింపుకునే రవికి నెయ్యి వేసిన పప్పన్నం

రుచి ఎలా తెలుపాలో అర్థం కాలేదు కాంతమ్మకు .

“ వాడిని కాస్త మచ్చిక చేసుకోండి అత్తయ్యా ..baby పుట్టా క కష్టం అవుతోంది..”

“ వాడు మరీ ‘చీ ‘ కొడుతూంటే ఎలా ? “సందేహంగా అడిగింది.

“పెద్దవారు మీరు కూడా పంతాలకు పొతే ఎలా? ఓ పదిసార్లు ఛీ కొట్టినా నెమ్మదిగా దగ్గరికి చేర్చుకోవాలి కదా “

అలా ప్రయత్నించినప్పుడే తన ముఖం మీద కళ్ళ అద్దాలు పడిపోయ్యేలా విదిలించి కొట్టాడని రవి గురించి చెప్పాలా ..వద్దా...అర్థం కాలేదు ..తల్లి తండ్రిని తప్ప మరో మనిషిని రవి accept చెయ్యలేక పోతున్నాడనేది మాత్రం పచ్చి నిజం !!

పద్మ డెలివరి అయ్యాక కూడా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది . పసి పిల్లాడికి కాస్త జలుబు చేస్తే , కొంచం పసుపు నీళ్ళలో కలిపి వేడి చేసి పట్టు వేస్తె తగ్గి పోతుం ది అని చెప్పబోయింది కోడలికి .

“ అవన్ని పాత పద్దతులు అత్తయ్యా ‘ అంటు డాక్టర్ దగ్గరికి తీసుకేడుతున్న కోడలిని చూసి నివ్వెర పడింది .

కాస్త జలుబుకే డాక్టరా ???

మరురోజు ఆగని వెక్కిళ్ళ కొసం అర్ధరాత్రి Emergency Room కి వెళ్ళిన వాళ్ళు తెల్లారాక వస్తే అసలు విషయం ఏమిటో అర్థం కాలేదు కాంతమ్మకు . Emergency room అంటే emergency గా చూడరా ????

‘యిరవై నాలుగు గంటలు diaper లోనే వుంటే ఎలాగా కాస్సేపు వదిలెయ్యి పద్మా గాలి తగలనీ ...” అన్నప్పుడు

“ అలా అలవాటు చేస్తే కష్టం అత్తయ్యా ..ఇక్కడ ఇలాగే ..”

అయిదేల్లయినా లాగూ వదిలేసి వీధి వెంట పరుగెత్తిన శ్రీకాంత్ గుర్తుకు వచ్చాడు ఆమెకు ...అల్లా తిరిగిన శ్రీకాంత్ అమెరికా దాకా ఎదగలేదూ ??

*************** ************************ ********************

ఆరోజు కాంతమ్మ తిరుగు ప్రయాణం ఇండియా కి ...

ఎప్పుదూ గల గలా మాట్లాడుతూ వుండే శ్రీకాంత్ తల్లితో కనీసపు మాటలు మాట్లా డా నికి తీరిక దొరకని సమయాలు, ఎంత నాన్నమ్మ అయినా కొత్త మూడో మనిషిగా వొప్పు కోనీ రవి మనస్తత్వం ,పూజలు , పునస్కారాలు ఆహారపు అలవాట్లు అమెరికాతో adjust అయిన పద్మ ....ఇవన్ని ఎంత సరిపెట్టుకున్దామన్న అమెరికా వాతావరణానికి , అలవాట్లకి ,కట్టు బొట్టూ తీరుకి ఆహారంలో మార్పులకి ..తెలుగు మాట్లాడని మనవలకి adjust కాలేని కాంతమ్మ హృదయం బరువేక్కడం తో బాధగా aeroplane ఎక్కింది .

*********************

రచన – లక్ష్మీ రాఘవ

సుజన రంజనిలో {ఏప్రిల్} నా కథ

సుజన రంజనిలో నా కథ పబ్లిష్ అయ్యింది ఏప్రిల్ సంచికలో ....ఇదిగో లింకు ..చదివి అభిప్రాయం చెప్పండి.

కథ జగత్ --విశ్లేషణ

కథా జగత్ – విశ్లేషణ

అన్నదాత రైతు ,రైతుల సంక్షేమమే ధ్యేయం అంటూ పల్లె బాటలు, రైతుబాటలు , పోరు బాటలు అంటూ ఎన్నో ఉద్యమాలు చేపట్టినా మునుపు కాలం లో వున్న పల్లెలకు, పల్లెప్రజలకు ఇప్పుడున్న పల్లెలకు ఎంతో తేడా కనిపిస్తుంది . ఇళ్ళు కట్టుకోవడానికే కాక అనేక వాటికి బ్యాంకు రుణాలు ఇస్తూ ప్రభుత్వం సహకారం అందిస్తున్నా ప్రజల్లో ప్రేమానురాగాలు కరువై , రాజీ లేని రాజకీయాలతో మారిపోయి , పంతాలు ,కక్ష లతో పల్లెలు అట్టుడికి పోతున్నాయి . వర్షాలు పడక , జలాలు ఇంకిపోయి, భూమి బీటలు బారి , ఎన్ని బోరు బావులు తవ్వినా ఇంకా లోతుకు పోవాల్సిన అవసరమే వస్తోంది . పచ్చగా బతికిన రైతు , వర్షాలు లేక , సేద్యం చెయ్యలేక నిస్సహాయంగా కొడుకు పంచన చేరాల్సి వచ్చే ఒక రైతు కథ “ ఎర్రని ఎరుపు “

వృధాప్యం లో ఆదరించని కన్న పిల్లలు , వారి నిరాదరణకు కృంగి పోయినా మళ్ళి కొడుకు దగ్గరికి పోవడానికి ఇష్టపడని అభిమానం . మట్టి మీద మమకారంతో మళ్ళి వెనక్కు పల్లెకు చేరినా , అభిమానాలు కరువై అనారోగ్యం దరిచేరడం , అనుకొని పరిస్తితిలో జైలు శిక్ష , చావే శరణ్యం అన్న నిర్ణయం ,ఇంత జరిగినా ఎదుటి వ్యక్తికీ హాని తలపెట్టని ఓ నిజాయితీ .ఇలా ఉత్కంట బరితంగా నడిచే కథ .

జీవితానికి దగ్గరగా ,చక్కని రచనా శైలి తో మనసును కరిగించి కళ్ళు చెమర్చేలా చేస్తుంది .ఈ కథలో పచ్చని రైతు ఎదుర్కున్న సమస్యలు , వాటికీ పరిష్కారంగా అతను తీసుకునే నిర్ణయం తో తన జీవితం “ ఎర్రని ఎరుపు “ గా కనిపించి మనసును కలచివేస్తుంది .

ఇవేకాక ఆకట్టుకునే అంశం రచయిత విషయగమనం & సందర్భాను సార వాక్య ప్రయోగం .ఉదాహరణకి

“సాగునీటి మాట దేవుడెరుగు , తాగునీటికి అరమైలు వెళ్ళాల్సిన పరిస్తితి “

‘కనీసం నాకడానికి పచ్చిక వాసన కనిపించక పశువులు దిగులు పడినాయి “

“వొంటరితనం చెడ్డ దైతే , వృద్దాప్యం అంతకన్నా చెడ్డది

జైలు లో ప్రారంభమై జైలులోనే అంతమయ్యే ఈకథ కరువులో పల్లెల వాతావరణాన్ని ,

బాగా బతికిన రోజుల్లో అతని మంచి స్థితిని , కొడుకు దగ్గర జీవితాన్ని ,కొడుకు నిస్సహాయాతని అర్థం చేసుకుని అభిమానంతో వెనుతిరగడాన్నికన్నులకు కట్టినట్టు చెబుతుంది .

పల్లెలలో వచ్చిన మార్పులు ,అధిక కూలి రేట్లతో మనుష్యులలో వచ్చిన బద్ధకం,ఆదరణ చూపని కుటుంభికులు, వృద్దాప్యం లో తప్పని అనారోగ్యం ,అన్నిటికి సమాధానం అతను తీసు కున్న నిర్ణయం చదివిన ప్రతిఒక్కరిని ఆలోచింప చేస్తుంది ..అందుకే నాకు ఈ కథ నచ్చింది .

ఇంత చక్కని కథని అందించిన రచయిత..టిఎస్ . ఏ .కృష్ణమూర్తి గారు , అందరికి అందు బాటు లో వుంచిన

కథా జగత్ అభినందనీయులు .

ఈ కథ లింకు http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/errani-erupu---ti-es-e-krsnamurti

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template