లాక్ డౌన్ కాలం లో ఎన్నో అవసరాలు! అందులోనూ రెండునెలలు పైగా అంటే .....ఇది చదివాక మీకూ అవసరమా? అనిపిస్తుందేమో చూడండి
దొరకనిది...
సూపర్ మార్కెట్ లో చాలా సేపటి నుండీ తచ్చాడుతున్న మోహన రావు ను షాపు లో కుర్రాడు. వచ్చి
“ఏమి వెదుకుతున్నారు సార్...చాలా సేపయ్యింది. బయట మిగిలిన వారు వెయిట్ చేస్తూ వున్నారు. అందరినీ లోపలకు పంపడం లేదు గదా కరోనా సమయంలో”
“అయిపోయిందయ్యా ..అన్నీ దొరికాయి .ఒక్క దాని కోసం చూస్తున్నా ...”
“చెప్పండి సార్ నేను ఎక్కడ వుందో చెబుతాను..” ఆ అబ్బాయి వదలటం లేదు. కరోనా లాక్ డౌన్ లో అందరికీ నిత్యావసర వస్తువులు కావాలి గదా అనుకుంటున్నాడు.
“ఇలా రా “అని దగ్గరకు పిలిచాడు ఆ అబ్బాయిని “దగ్గ్గరకు రాకూడదు సార్” అన్నాడు ముఖాన వున్న మాస్కు ను సరిచేసికుంటూ
‘సరే మెల్లిగా చెబుతాను..’.అని మెల్లిగా చెప్పాడు మోహన రావు.
“సార్..దాని కౌంటర్ ఆ వైపు వుంది కానీ స్టాక్ లేదు. అయినా ఇప్పుడు అవసరమా సార్?” అతని మాటలకు చిర్రెత్తుకొచ్చింది మోహనరావుకు
“అమ్మడం మీ పని . కావాలసినవి కొనుక్కోవడానికే మేము వచ్చేది...మాకు అవసరమో లేదో అడిగే హక్కు మీకు లేదు” కొంచెం పెద్ద గొంతుకతో అంటూన్న మొహనరావును చూస్తూ ఆ షాప్ యజమాని
“సారీ సార్. లాక్ డౌన్ పీరియడ్ కదా..వున్న వస్తువులను అమ్ముతున్నాము. కొత్తవి సప్లై లేదు...ప్లీజ్ కోపగించుకోకండి..”
మోహనరావు కు ఆ మాటలతో కొంత కోపం తగ్గి తను తెచ్చిన సామాను కౌంటర్ మీద పెట్టి “బిల్లు వేయండి” అనడం .యజమాని బిల్లు వేసి ఇవ్వగానే అతను డబ్బు పే చేసి బయటకు నడిచాడు.
బయట వెయిట్ చేస్తున్న వారు క్యూ లో వెడుతున్నారు లోపలికి.
మోహనరావు బయటకు వెళ్ళాక షాప్ యజమాని సేల్స్ అబ్బాయిని దగ్గరకు రమ్మని సైగ చేస్తే అతడు వచ్చాడు.
“మనం షాప్ తెరిచే ఈ కొద్ది గంటలలో కస్టమర్లకు సౌమ్యంగా జవాబు చెప్పడం నేర్చుకో...ఎంతో అవసరమైతే తప్ప వారు షాపుకు రారు గదా..మనకు వ్యాపారమూ జరగదు..ఈ లాక్ డౌన్ పీరియడ్ లో జాగ్రత్తగా వుండాలి. ..”
సేల్స్ అబ్బాయి సరే అన్నట్టు తల ఊపాడు.
“ఇంతకీ ఆయనకు దొరకని వస్తువు ఏమిటి? నోట్ చేసుకోన్నావా?? అడుగుతున్న యజమానితో
“ఆయన అడిగింది. హెయిర్ డై సార్....అది ఇప్పుడు అవసరమా ?” అని నేను అడగటం తో ఆయనకు కోపం వచ్చింది”అంటూన్న ఆ కుర్రాడి మాటలకు నోరు తెరుచుకున్నాడు యజమాని!!!!
******#