ఆగిన అత్త గారి సెంచురీ పరుగు.....

ఆగిన అత్త గారి సెంచురీ పరుగు
------------------------------------------------------------------------------------
జనవరి 2013 లో తొంబై ఏళ్ళ అత్తగారు
అనారోగ్యం తో ఆస్పత్రి పాలు !
ఊపిరి అందక ఎగపోత,
ఆగనా  అంటూ గుండె ,
పరుగెడలేను  అంటూ  బి.పి,....భయపెట్టారు చాలా.....
ఏమో ...ఎప్పుడో..చెప్పలేం అని
చేతులెత్తేసిన డాక్టర్ల అంచనా తారుమారు చేసి ,
ఊపిరి తిత్తుల శక్తి పెంచేసుకుని, గుండె లయ సరిచేసుకుని ,
వేగాన్ని పుంజుకున్న బి.పి తో ..
‘ఇది నా సెంచురీ కోసం పరుగు’ అంటూ ఇల్లు చేరారు అత్తగారు !!!
డైపర్లను వదిలించుకుని, టానిక్కులతో  శక్తి పెంచుకుని
ఆకలి ఎక్కువై..అనుక్షణం ‘ తిండి పెట్టవే కోడలు పిల్లా ‘ అంటూ
నన్ను పరుగులు తీయించి ....
అర్ధరాత్రి కూడా హార్లిక్స్ లతో కడుపు నింపుకుంటూ
నా నిద్రను పాడు చేసినా ...
‘సెంచురీ కై పరుగు కదా , ఆమాత్రం నాసాయం వద్దా’ అనుకుంటూ చేసాను సేవలు చాలా ..
ఆరు నెలల్లో ఆవిడ తయారైన తీరు అద్భుతం అనుకుంటూ వుండగా
జూన్ ఆరు తెల్లవారు జామున ‘ నన్ను పిలుస్తున్నారు నేను వెళ్ళాలి ‘ అని
ఆవిడ అంటే ‘సెంచురీ పరుగు కదా ..అప్పుడేనా వెడుదురు గానీ ‘అంటే
సరేనంటూ’ ఆరోజు కార్యక్రమాలు ముగించుకుని
రాత్రి పడుకుంటానంటూ  చెప్పిన ఆవిడ
నిశ్శబ్దంగా అర్ధరాత్రి పరుగు చాలించుకుని ,
సెంచురీ వద్దనుకుని
పరలోకానికి పయనమై వెళ్లారు ...
బోసిపోయిన ఆవిడ రూమూ ,
పరుగులెత్తిన నేను...

మరచిపోలేని ఆవిడ జ్ఞాపకాలు  మిగిలాయి ....

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

అత్తా కోడళ్ళ అనుబంధం .అది . మీ సేవలు కి ఆమె సంతృప్తి చెంది చాలని వెళ్ళిపోయారు .
సెంచరీ అందరికి కష్టం లక్ష్మి గారు . ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ అమెతొ మీ అనుబంధాన్ని జ్ఞాపకాలుగా వ్రాసేయండి . అందరూ నేర్చుకోవాల్సినవి చాలా ఉంతాయి

Lakshmi Raghava said...

నిజమే వనజ గారు ,
ఒక్కసారి ఉహించుకోండి తొంబై లో ఆవిడా, అరవై ఐదులో నేను , నలబైరెందేళ్ళ మా సంబంధం ఎలావుండి వుంటుందో ....రాయచ్చు చాలా ..ముఖ్యంగా పడకమీద వున్నప్పుడు చిన్న పాపాయిలా మొండి తనం... ఇంకా కొంచం టైము కావాలి..రాస్తాను ..

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template