ఒక జ్ఞాపకం

        ఒక  జ్ఞాపకం
--------------------------------
యాభై ఏళ్ళ పైమాటే......
అప్పుడు గ్యాసు పొయ్యిలు లేవు.
ఇత్తడి స్టవ్ లో కిరోసిన్ పోసి గ్యాసు కొట్టి వెలిగించేవి వున్నా  అవి పేలి పోతాయనే వదంతులు  ఉండడంతో వాటి వాడకము తక్కువే ..కాబట్టి వంటచేయ్యాలంటే కట్టెల పొయ్యిలు తప్పనిసరి.వాటి తో పాటు ఎక్కువగా వాడబడేది ఇనుప కుంపటి !
కట్టేలపోయ్యి లో పడ్డ నిప్పులను తీసి ఆర్పేసి బొగ్గులు చేసుకునేవారు . ఆ బొగ్గులు కుంపటి లో వేసి అడుగున కొంచెము టెంకాయ నార పెట్టి అంటించి కుంపటి కింద వున్న బొక్క [ opening ] దగ్గర విసన కర్రతో విసిరితే నెమ్మదిగా నిప్పులు తయారయ్యేవి. ఈ కుంపటి ని రాయలసీమలో బాగా వుపయోగిస్త్తారు ,
   మా పుట్టిల్లు .’ గట్టు ‘ గ్రామం , మదనపల్లి తాలూకా , చిత్తూరు జిల్లా .మా చిన్నప్పుడు పొద్దున్న లేవగానే మా అమ్మ స్వర్నమ్మ  కుంపటి వెలిగించేది. ఇత్త డి  కేటిల్ లో నీళ్ళు పెట్టి కాఫి డికాషన్ వేసేది. పాలు కూడా కుంపటి లోనేకాచేది  పాలు అడుగు అంటేవి కావు  చిక్కటి మీగడ కూడా కట్టేది . ఆ తరువాత  కుంపటి లోనే కంది పప్పు వుడికేది. అలా  నిదానం గా వుడికిన కంది పప్పు కట్టు తో పెట్టే చారు [ రసం] టమాటోలు వేయకపోయినా ఎంతో రుచి గా వుండేది .
జున్ను పాలు విరగ గొట్టి  , పాల విరుగుడు  బెల్లం కలిపి కుంపటి  మీద  బాణట్లో వేస్తె పిల్లలం కూర్చుని కలియబెట్టే వాళ్ళం..హల్వా లాటివి కూడా అడుగు అంటకుండా నిదానంగా కుంపటి లోనే సాద్యం అయ్యేది . ఎక్కువ సెగ కావాలంటే ఎక్కువ బొగ్గులు వేసి నిప్పులు చేసేవాళ్ళం . వద్దని అనుకుంటే నిప్పులు తగ్గించేసి సన్నని సెగ వాడేది అమ్మ .అలా నిప్పుల్లో నూనే రాసిన వంకాయలు కాల్చి  చేసె పచ్చడి ఇప్పటికి మరచిపోలేదు . పనస గింజలు కూడా దీని లోనే కాల్చుకుని తినేవాళ్ళం .
మదనపల్లె దగ్గర కాబట్టి  చలి కాలం బాగా  చలి వేసేది .పొద్దున్న లేవగానే  కుంపటి చుట్టూ కూర్చుని చేతులు వెచ్చ చేసుకునే వాళ్ళం . ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే కొంచం నిప్పులు వున్న కుంపటిలో చక్కెర , పసుపు చల్లి ఆ పొగ పట్టించేవాళ్ళు ముక్కు దిబ్బడ  నిముషం లో మాయ మయ్యేది .
 మేము పెద్ద వాళ్ళమై పెళ్ళిళ్ళు అయి సిటీ లకు పోయినా  కానుపులకు పద్దతిగా పుట్టింటికి వచ్చేవాళ్ళం . చిన్న పిల్లకు , బాలింతకు సాంబ్రాణి పొగ కొసం చిన్న ఇనప కుంపటి వుపయోగించేది అమ్మ ,అంతేకాదు బాలింతకు చలవలు చేస్తాయని  కుంపటి నిప్పుల్ల శాకం తో అరి కాళ్ళు చేతులు కాచు కోవాలన్నది రూలు .
మా పిల్ల లందరూ అత్తారిళ్ళకు వెళ్ళాక ఉద్యోగాల పర్వం ముగిసి , విశ్రాంత జీవనానికి మా అత్తవారి వూరు “కురబలకోట” [ మా పుట్టింటికి దగ్గరే ] వస్తే , ఎనభైఎనిమిదేళ్ళ మా అమ్మ స్వర్నమ్మ ఇచ్చిన అపురూప కానుక ఈ ‘ కుంపటి” దీన్ని చూసిన ప్పుడల్లా మా చిన్న తనం గుర్తుకు వచ్చి దాని గురించిన జ్ఞాపకాలను మా మనవళ్ళకు, మనవరాళ్ళ  కు  చెబుతూ వుంటా గర్వంగా...

12 comments:

Priya said...

ఆంటీ గారు... మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయండీ :)

Lakshmi Raghava said...

thank you priya

Unknown said...

ఇలా బామ్మ గారు అలనాటి కుంపటి పొయ్యి జ్ఞాపకాలను గర్వంగా గుర్తు చేసుకోవటం చాలా బాగుంది.

Lakshmi Raghava said...

thank you chinni aasha garu

సి.ఉమాదేవి said...

కలవరిస్తున్న మదనపల్లిని కనులముందు నిలిపారు.పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం అమ్మ ఒడిని తలచుకోవడమే!

శ్రీలలిత said...


చిన్ననాటి అపురూపమైన ఙ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసారండీ.. చాలా బాగా రాసారు. అభినందనలు..

Lakshmi Raghava said...

శ్రీ లలితా,ఉమా మీ కామెంట్ చదువుతుంటే అమ్మ నా దగ్గరికి వచ్చింది చూసి పోదామని ...ఆమెకు చూపాలి ఇదీ . థాంక్స్ మీ ఇద్దరికీ

Chinni said...

baavundanDi.. maa inTlo kUDaa alantidi ippatiki vundi..kakapote adi inupadi kaadu..maTTidi.:)chaala baagaa vraasaaru.

Lakshmi Raghava said...

చిన్ని గారు , మొదటిసారి నా దగ్గరకు వచ్చారు. మీకు కుంపటిని జ్ఞాపకం చేసుకునేల చేసినందుకు , నన్ను పలకరించినందుకు ధన్య వాదాలు

Kishore said...

మా ఇంట్లో కూడ ఇటువంటిదే ఇనుప కుంపటి ఉండేది. బహుశా ఇప్పుడు కూడ ఏ మూలో ఉండే ఉంటుంది. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మనడగాలి. చలికాలంలో అక్కతొ కలసి కుంపటి చుట్టు చేరి కూర్చొని కబుర్లు చెప్పుకున్నది మధుర స్మృతులే. గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

Lakshmi Raghava said...

థాంక్ యు కిశోర్ గారు
లక్ష్మి రాఘవ

సుజాత వేల్పూరి said...

ఓహ్హ్..కుంపటి చూసి ఎన్నాళ్ళయిందో!మా ఇంట్లో నా చిన్నప్పుడు కుమప్టి ఉండేది. కుంపటి మీద సన్న సెగతో వండే వంట ఏదైనా దాని రుచి అంతా ఇంతా కాదు. మైసూర్ పాక్ వంటి వంటలు కుంపటి మీదే ప్రత్యేకం చేసేది మా అమ్మ!

మాలతీ చందూర్ గారి వంటల పుస్తకంలో కూడా చాలా వంటలు కుంపటి మీదే చెయ్యాలని రాస్తారు.
మీరు చెప్పినట్లే పచ్చడి కోసం కుంపట్లో వంకాయలు కాల్చడం, పనస గింగలు,చిలగడ దుంపలు కాల్చడం ఇవన్నీ చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు!

మా అమ్మమ్మ..కుంపటి రాజెయ్యడం భలే గొప్ప ఆర్ట్ గా కనిపించేది నాకు!

చాలా థాంక్స్! బాల్యంలోకి ప్రయాణం కట్టించారు రుచి కరంగా!

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template