మిమ్మల్ని చదివించే ఒక 'సమీక్ష'




 ఒక కథల పుస్తకం వేసుకుంటే ఇంత  బాగా వుంటుందని తెలియలేదు. లేటు  వయసులో నయినా ఈ కిక్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ మధ్య వచ్చిన "నా వాళ్ళు" అన్న నా పుస్తకం పై ఈ సమీక్ష మిమ్మల్ని చదివిస్తు౦దని ఆశిస్తూ ...



బాగున్న కథలతో...నా వాళ్ళు...
---------------------------------------------
అప్పుడప్పుడూ కొన్ని సార్లు మనకెదురైన సంఘటనలు, సందర్భాలూ ఎంతో కొంత కదిలిస్తాయ్ కొన్ని రోజుల పాటు వెంటాడ్తాయ్...ప్రతి ఒక్కరికీ అనుభవమే...కానీ కొందరు మాత్రమే అలా కదిలించిన సంఘటనలు తారసపడ్డ అనుభవాల్లోంచీ తివృత్తాలను తీసుకుని చక్కటి కథలుగా చెప్పేస్తారు. అందునా రచయిత్రులు ఇలా కథలుగా మరచడంలో నిష్ణాతులు కదా....అలా తానెరిగిన సమాజంలోంచీ, తన చుట్టూ వున్న మనుష్యుల జీవితాల్లోంచీ వస్తువు తీసుకుని కథలు వ్రాసిన డాక్టర్ కె వి లక్ష్మీ రాఘవ గారు వెలువరించిన నా వాళ్ళు- అనే కథల సంపుటిలో నాణ్యమైన ఓ 20 కథలున్నాయి. కొన్ని మెప్పిస్తాయ్..మరి కొన్ని ఒప్పిస్తాయ్. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ కథకురాలైన లక్ష్మీ రాఘవ గారు సాహితీ సృజనతో పాటు చిత్రలేఖనం, బొమ్మల తయారీలో కూడా నిష్ణాతులే కావడం అభినందనీయం. బోధనా రంగంలో వుండే వారికి సహజంగా లభించే వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మనస్తత్వాలను అధ్యయనం చేయడం ద్వారా కొన్ని కథలకు ఇతివృత్తాలను తయారు చేసుకున్నట్లుంది.ఇందులో.. నా వాళ్ళు- అనే శీర్షిక గల కథ ఓ అమ్మ తపనకు అద్దం పడ్తూ..అనాధ శిశువును అక్కున చేర్చుకుని మంచి జీవితాన్ని ఇచ్చేందుకు రమ్య పాత్ర పడ్డ క్షోభ- కథ సుఖాంతం చేసిన తీరూ బాగుంది. ఈ సంపుటిలో ప్రధానంగా గీత, ఐ హేట్ మమ్మీ అనే కథల గురించి చెప్పుకోవాల్సిందే. పిల్లల పెంపకంలో తల్లులు విస్మరించే అంశాలూ- తద్వారా ఆడపిల్లలెదుర్కొనే మానసిక సంఘర్షణా చక్కగా వ్యక్తీకరించారు. ముఖ్యంగా పరిష్కారాలతో కథలను ముగించడం హర్షణీయం. కేవలం సంఘటనలను ఓ మాలగా గుచ్చేసి పాఠకుల ముందు పెట్టేయడం కాకుండా కొన్ని సమస్యలకు సాధ్యమైనంత వరకు నేలవిడిచి సాము చేయకుండా పరిష్కారాలు సూచిస్తూ మెప్పించారు.తండ్రి ప్రేమ వుంటే తాను దేన్నయినా సాధించగలననుకునే గీత పాత్రతల్లి నిరాదరణ కారణంగా నలిగిపోవడం, చివరకు ఆత్మస్థైర్యంతో లక్ష్యం వైపు అడుగులు వేయడం రచయిత్రిగా చక్కగా తీర్చిదిద్దారు.అలాగే ఐ హేట్ మమ్మీ అనే కథ-పిల్లల పెంపకానికి ఓ గైడ్ పాఠంలా వుంది. టీవీల్లో వస్తున్న ఆట-పాట షోలమీద గతంలో చాలా కథలు వచ్చాయి కదా..అదే తరహాలో ఆలోచించండి అనే శీర్షికతో లక్ష్మీ రాఘవ గారు వ్రాసిన కథ కూడా ఆలోచించాలనిపించింది.మధ్య తరగతి జీవితాలను ప్రభావితం చేసే అంశాలనే ఎంచుకుని మొత్తం 27 కథలతో ఈ సంపుటి తెచ్చారు. ఇందులో గురివింద అనే కథ కూడా పిల్లల పెంపకానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిందే కాగా ...తిరుమల కొండకు వెళ్ళే వారి అగచాట్లను బ్రేక్ దర్శనం అనే కథలో దృశ్యమానం చేసారు. అమ్మంటే ఏమిటో తెలియచేస్తూ భద్రమ్మ కొడుకు అనే కథను హృద్యంగా మలిచారు.మిగిలిన కథలు కూడా చదివించేవిగానే పాఠకులను ఆకట్టుకుంటాయ్. పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత అలా ఆటోమేటిగ్గా అన్నీ చదివేస్తాం. చివరగా...నాకు నచ్చిన కథ మాత్రం- దేవుడూ దెయ్యమూ- అనే కథ....చాలా బాగా వ్రాసారు. ప్రమాణాల పరంగా భేషుగ్గా వుంది. తెలుగు రచయితలు అలాంటి కథల జోలికి సాధారణంగా వెళ్ళరు కానీ....లక్ష్మీ రాఘవ గారు ఇంకా అలాంటి కథలు వ్రాస్తే పాఠకులను మెప్పించవచ్చు. 

0 comments:

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template